రష్యాపై కఠిన ఆంక్షల బిల్లుపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడికి ప్రతీకారంగా, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా కీలక అడుగు వేసింది. రష్యాపై సమగ్ర ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేసి, దాన్ని చట్టంగా మార్చారని వైట్ హౌస్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్‌తో యుద్ధానికి అవసరమయ్యే ఖర్చులను భరించకుండా మాస్కోను నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అందుకోసం రష్యాకు చెందిన కీలకమైన ఇంధన, రక్షణ రరంగాలతో పాటు, ప్రస్తుతం విధించిన ఆంక్షల నుంచి తప్పించుకుంటూ వ్యాపారం సాగిస్తున్న రష్యా "షాడో ఫ్లీట్" ట్యాంకర్లను కూడా ఈ చట్టం ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది.
ఈ నూతన చట్టం ప్రకారం రష్యా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములపై కూడా భారీగా సుంకాలు (టారిఫ్‌లు) విధించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. అయితే, ఈ చట్టం ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అమల్లో ఉండేలా సుంకాలు విధించే అధికారాన్ని ఇస్తుండటంతో, భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జూలైలో కన్నుమూసిన సౌత్ కరోలినా రిపబ్లికన్ నాయకుడు, దీర్ఘకాల రష్యా వ్యతిరేకి అయిన లిండ్సే ఓ. గ్రాహం జ్ఞాపకార్థం ఈ చట్టానికి "లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల చట్టం 2026" అని పేరు పెట్టారు. ఆయన ఈ బిల్లు ఆమోదానికి గట్టి మద్దతుదారుగా నిలిచారు. గత నెలలో సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు, బుధవారం అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లోనూ ఆమోదం పొందింది.