business
వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే వికసిత రాష్ట్రాలు ముఖ్యం: చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ. అనంత నాగేశ్వరన్
సూర్య బిజినెస్ డెస్క్: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 'వికసిత భారత్ 2047' లక్ష్యం నెరవేరాలంటే, ముందుగా రాష్ట్రాలు ఆర్థికంగా ప్రగతి సాధించడం ఎంతో కీలకమని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ. అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన 'ఫైన్సింగ్ ఇండియాస్ జర్నీ టুয়ার্ডస్ వికసిత భారత్' రెండు రోజుల సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 'వికసిత భారత్ కోసం వికసిత రాష్ట్రాలు' అనే నినాదంతో ముందుకు వెళ్లాలని, ఇందుకు ప్రైవేట్ రంగ మూలధన భాగస్వామ్యాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. కేవలం కేంద్ర ప్రభుత్వ వనరులపైనే కాకుండా, రాష్ట్రాలు కూడా తమ మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) పెంచుకుంటూ పోవాలని సూచించారు.
పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని సీఈఏ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల్లో స్థిరమైన వృద్ధిని సాధించాలంటే రాష్ట్రాలు మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మొదటిగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు పారదర్శకమైన విధానాలు, సింగిల్ విండో అనుమతులు, భూమి, విద్యాయుత్ మరియు లాజిస్టిక్స్ సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. రెండవదిగా మెరుగైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, తయారీ రంగంలో కచ్చితమైన ప్రణాళికలతో పాటు మూడవదిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాల సొంత మూలధన వ్యయాన్ని జీఎస్‌డీపీలో 3 శాతానికి పెంచుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు.
ఇదే సదస్సులో పాల్గొన్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ మాట్లాడుతూ, దేశ వృద్ధి రేటును 7 నుంచి 8 శాతాల మధ్య నిలకడగా ఉంచడానికి ప్రస్తుత స్థూల దేశీయ పొదుపు రేటును 34 శాతం నుంచి 38-40 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు. రాష్ట్రాలు తమ ద్రవ్య లోటును అదుపులో ఉంచుకుంటూ, రుణ స్థిరత్వాన్ని కాపాడుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి పన్ను వసూళ్లను మెరుగుపరుచుకోవాలని కోరారు. వ్యవసాయ రంగం ఆధునీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో కూలంకషంగా చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక వర్కింగ్ గ్రూపుల ద్వారా ఈ ప్రణాళికలను అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.