విశ్వనగర్ నూతన బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
శ్రీరామ టాకీస్ పక్కన విశ్వనగర్ బ్రిడ్జితో తీరనున్న రాకపోకల కష్టాలు: మంత్రి ఫరూక్
-నంద్యాలలో త్వరలో విశ్వనగర్ నూతన బ్రిడ్జి పనులు: క్షేత్రస్థాయిలో మంత్రి ఫరూక్ పరిశీలన
నంద్యాల అర్బన్:
నంద్యాల పట్టణ పరిధిలోని శ్రీరామ టాకీస్ పక్కనుంచి విశ్వనగర్‌కు రాకపోకలు సాగించేందుకు వీలుగా నూతనంగా నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు, క్షేత్రస్థాయి పరిస్థితులను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలు విశ్వనగర్ వెళ్లేందుకు పడుతున్న రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి, బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన ప్రణాళికతో చాము కాల్వపైన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. శ్రీరామ టాకీస్ సమీపం నుంచి విశ్వనగర్‌కు చాముకాలువ పైన ఈ నూతన బ్రిడ్జి పూర్తయితే పరిసర ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, చంద్రారెడ్డి, కళ్యాణ్, టిడిపి జిల్లా ఆఫీస్ సెక్రటరీ రాజేష్ (బుజ్జి), అక్బర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.