|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 06:21 PM
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి తెరతీసింది. వేసవి కాలం రావడంతో.. రేషన్ కార్డు లబ్ధిదారులకు 3 నెలల రేషన్ సరుకులను ఒకేసారి అందించాలని భావిస్తోంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని.. ఏప్రిల్ నెలలోనే అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతుండగా.. రానున్న రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే భానుడి ప్రతాపం దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ప్రతీ నెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఇక గత ప్రభుత్వ హాయంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం దాదాపు తెలంగాణలో కోటికి పైగా రేషన్ కార్డు లబ్దిదారులు ఉన్నారు.
ఇక ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం కోటాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించడంతో ఆ మేరకు రాష్ట్రంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయా.. ఇలా ఒకే నెలలో మూడు నెలల బియ్యాన్ని సరఫరా చేయడంపై సాధ్యాసాధ్యాలను తెలంగాణ సర్కార్ పరిశీలిస్తోంది. ఒకేసారి 3 నెలల కోటా బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా.. గతంలో ఇచ్చినప్పుడు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే నెలలో మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో అటు లబ్ధిదారులతోపాటు.. రేషన్ డీలర్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుంది. అంతేకాకుండా డీలర్లు, హమాలీ కూలీ కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ 3 నెలల బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం తమ వద్ద లేదని అదే పెద్ద సమస్యగా మారిందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక 3 నెలల రేషన్ పొందాలంటే.. ఒక్కో లబ్దిదారుడు ఒకేసారి 3 వేలి ముద్రలు వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. దీంతో గతంలో తలెత్తిన ఇలాంటి సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది.