|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 06:12 PM
వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా పని చేసే కూలీల.. హాజరు నమోదులో ఇప్పటికి ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపించింది. కూలీలు పని చేసే ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు రావడం, మొబైల్ యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి టెక్నికల్ కారణాలతో పలువురు కూలీలు పనిచేసినప్పటికీ అటెండెన్స్ పడకపోవడంతో వేతనాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ క్రమంలోనే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో చేసిన మార్పులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డీ దివ్య మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
మారుమూల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య ఏర్పడితే ఇకపై పని ఆగకుండా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఆఫ్‌లైన్ విధానంలో కూలీల హాజరు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఇలా ఆఫ్‌లైన్‌లో నమోదు చేసిన హాజరు, ఫొటోలను.. సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత రెండు రోజుల్లోపు అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించారు. మేట్, ఫీల్డ్ అసిస్టెంట్ల ఫోన్లు పనిచేయకపోయినా.. సాంకేతిక సమస్యలు వచ్చినా.. ఇంకో ఫోన్‌లో జన్మన్‌రేగా యాప్‌ను ఉపయోగించి జియో ట్యాగ్ ఫొటోలతో హాజరు వేయవచ్చని వెల్లడించారు. ఇలా చేసేందుకు సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పారు.
ఇక ఇప్పటివరకు ఫేస్ అథెంటికేషన్ కోసం ఐరిస్ నిబంధన తప్పనిసరిగా ఉండేది. ఇలా చేయడం వల్ల అంధ కూలీల హాజరు నమోదు కావడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. అంధులు తమ దృష్టి లోపానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సమర్పిస్తే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి సాధారణ ఫొటోతో హాజరు తీసుకుంటారు.
కొన్ని టెక్నికల్ కారణాలతో ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. కూలీ అర్హుడైతే పని కల్పించేలా అధికారులు తాజాగా వెసులుబాటు కల్పించారు. అధికారుల వెరిఫికేషన్ తర్వాత ఫేస్ అథెంటికేషన్ లేకుండానే కూలీల హాజరు తీసుకునే అవకాశం ఉంది. 15 రోజుల్లోగా పెండింగ్ హాజరును పరిష్కరించాలని.. లేకపోతే ఆ డేటాను సిస్టమ్ శాశ్వతంగా తిరస్కరిస్తుందని కమిషనర్ తేల్చి చెప్పారు.