సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ
*రూ. 14 లక్షల ఆర్థిక సాయం అందించిన చెట్టినాడు సిమెంట్ కంపెనీ
*చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 21):తాండూర్ మండలం సంగెంకలాన్ గ్రామంలో గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు ఊరట లభించింది. బాధితులైన 57 మంది రైతులకు రూ. 14 లక్షల విలువైన పంట నష్టపరిహారం చెక్కులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేశారు. చెట్టినాడు సిమెంట్ కంపెనీ యాజమాన్యం సామాజిక బాధ్యతగా ఈ పరిహారాన్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సిమెంట్ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆశ్వాసన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.