గోవాలో బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు
శాసనసభలో మంత్రి నీలకంఠ హలర్ంకర్ వెల్లడి
పణాజీ: గోవాలోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు వంటి బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించి, వాటికి స్టెరిలైజేషన్ మరియు టీకాలు వేసిన అనంతరం ఆశ్రయ కేంద్రాలకు (షెల్టర్ హోమ్స్) తరలించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి నీలకంఠ హలర్ంకర్ తెలిపారు. బుధవారం శాసనసభలో ఎమ్మెల్యే అలెక్సియో లోరెంకో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
నవంబర్ 7, 2025 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రాంగణాలు, బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించి జంతు జనన నియంత్రణ (ABC) నిబంధనలు - 2023 ప్రకారం ఆశ్రయ కేంద్రాలకు తరలించే ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి ఉటంకించారు.
జంతు జనన నియంత్రణ (ABC) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన ప్రధాన చట్టపరమైన బాధ్యత పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీల పరిధిలోని స్థానిక సంస్థలదేనని తెలిపారు. పశుసంవర్ధక శాఖ దీనికి సహాయక సంస్థగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. 2019 పశుగణన ప్రకారం రాష్ట్రంలో 27,864 వీధి కుక్కలు ఉన్నాయని, నవంబర్ 2024 - ఏప్రిల్ 2025 మధ్య నిర్వహించిన 21వ పశుగణన అధికారిక గణాంకాలు త్వరలోనే విడుదల కానున్నాయని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ల వారీగా, పర్యాటక శాఖ, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ నుంచి కుక్క కాటు ఘటనల సమాచారం అందిందని, ఈ విపత్తు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సభకు వివరించారు. ప్రజా సురక్షిత మరియు జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.