BREAKING
ప్రిన్స్ రహీం అగా ఖాన్ V పర్యటన హోటల్లో అవమానం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం వరకు.. రామ్‌రాజ్ కాటన్స్ అధినేత నాగరాజన్ స్ఫూర్తిదాయక ప్రస్థానం తాండూరు సమీపంలోని చారిత్రక జుంటుపల్లి రామాలయం.. గుట్టపై వెలసిన విశిష్ట శ్రీరామ క్షేత్రం యశోద హాస్పిటల్స్‌లో ఇన్-హౌస్ జన్యు విశ్లేషణ సదుపాయం ఉదయం అల్పాహారం మానేస్తున్నారా? ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం! విద్యార్థులకు అలర్ట్.. ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు అక్టోబర్‌ 12 వరకు అవకాశం! దేశవ్యాప్తంగా నేడు బ్యాంకుల బంద్.. సేవలకు అంతరాయం కలిగే అవకాశం! దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా గణేశ్ ఆగమన్.. కన్నులపండువగా వినాయకుడి రాక! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. కిలో రేటు ఎంతంటే? తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం బంగారం ధర ఎంతంటే.. పెరిగిన పసిడి రేట్లు! హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు దుర్గం చెరువు బంద్! అక్టోబర్ 27న ఢిల్లీలో ESTIC-2026ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ BRICS 2026 శిఖరాగ్ర సమావేశానికి భారత్ సిద్ధం భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని మోదీ, ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ సమీక్ష ఏరోస్పేస్, స్వదేశీ నావిగేషన్‌లో దూసుకెళ్తున్న భారతదేశం

హోటల్లో అవమానం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం వరకు.. రామ్‌రాజ్ కాటన్స్ అధినేత నాగరాజన్ స్ఫూర్తిదాయక ప్రస్థానం

Select Suryaa Now
హోటల్లో అవమానం నుంచి వేల కోట్ల సామ్రాజ్యం వరకు.. రామ్‌రాజ్ కాటన్స్ అధినేత నాగరాజన్ స్ఫూర్తిదాయక ప్రస్థానం

సూర్య స్పెషల్ డెస్క్: శుభకార్యం ఏదైనా, పండుగ పర్వదినం వచ్చినా తెలుగు లోగిళ్లలోనే కాక దక్షిణాది అంతటా మగవారంతా తెల్లటి ధోవతి కట్టులో మెరిసిపోతుంటారు. ఆ ధోవతుల మార్కెట్‌లో రారాజుగా నిలిచిన బ్రాండ్ రామ్‌రాజ్ కాటన్స్. అయితే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ సంస్థ పునాదుల వెనుక ఒక అవమానం, ఆ అవమానాన్ని విజయంగా మలచిన ఒక సామాన్య నేతన్న కొడుకు సంకల్పం దాగి ఉంది.

 ఒకసారి చెన్నైలోని ఒక స్టార్ హోటల్ వివాహ విందు కోసం వెళ్లినప్పుడు పంచె కట్టుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో ప్రవేశాన్ని నిరాకరించి సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ క్షణంలో తీవ్ర మానసిక క్షోభకు గురైన రామ్‌రాజ్ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్. నాగరాజన్, కుంగిపోకుండా మన సంప్రదాయ వస్త్రమైన ధోవతిపై సమాజంలో ఉన్న చులకన భావాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడైతే పంచెకట్టును అవమానించారో, అదే తరహా హోటళ్లలో పంచెకట్టుతో వెళ్లిన వ్యక్తికి సెల్యూట్ చేసేలా సెల్యూట్ రామ్‌రాజ్ పేరుతో ప్రకటనలు రూపొందించి భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు నూతన వైభవాన్ని తెచ్చిపెట్టారు.


​తమిళనాడులోని తిరుపూర్ సమీపంలోని అవినాశి గ్రామానికి చెందిన నాగరాజన్ కుటుంబ నేపథ్యం చాలా సామాన్యమైనది. తొమ్మిదో తరగతిలో స్కూల్ ఫీజు కట్టలేక బాలమిత్ర పుస్తకాల ఏజెన్సీ నడిపి ఫీజు సంపాదించుకున్న ఆయన, టైప్ ఇన్‌స్టిట్యూట్ ఫీజు పదిహేను రూపాయలు కట్టలేక ఇంటర్ ఫస్టియర్‌తోనే చదువు ఆపేశారు. అనంతరం తిరుపూర్‌లోని ఒక వస్త్ర సంస్థలో ఉద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో పర్యవేక్షకుడిగా పనిచేశారు. అక్కడ నేతన్నలు సరైన బట్టలు లేకుండా ఆకలితో అల్లాడటం, యజమానుల దోపిడీకి గురవడం చూసి చలించిపోయారు. ఆ అనుభవంతో 1983లో తన తండ్రి రామస్వామి పేరులోని రామ్, తన పేరులోని రాజ్ కలిపి రామ్‌రాజ్ ఖాదీ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో అందరూ బనియన్ల ఎగుమతి వ్యాపారం వైపు వెళుతుంటే, ఆయన మాత్రం పక్కా సంప్రదాయ పంచెల తయారీని ఎంచుకుని సాహసం చేశారు.


​వ్యాపారంలో లాభం కంటే నాణ్యత మరియు నేత కార్మికుల సంక్షేమమే ప్రధానమని నాగరాజన్ నమ్మారు. మార్కెట్‌లో మీటరుకు రెండు రూపాయలు ఇస్తుంటే, ఆయన ఏకంగా నాలుగు రూపాయల రెట్టింపు కూలీ చెల్లించి ఏడాది పొడవునా పని కల్పించారు. నాణ్యమైన పత్తి నూలుతో రూపొందించిన ధోవతులను మొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరు రిటైల్ మార్కెట్‌కు స్వయంగా తీసుకెళ్లి విక్రయించారు. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు రోజూ పద్నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కిన ఆనాటి అంకితభావమే నేడు రామ్‌రాజ్‌ను వేల కోట్ల సామ్రాజ్యంగా నిలబెట్టింది. ప్రస్తుతం దక్షిణాది వ్యాప్తంగా నూట డెబ్బైకి పైగా భారీ షోరూమ్‌లు, రెండు వేల ఐదు వందల రకాల పంచెలు, షర్టులు, లినెన్ దుస్తులతో ఈ సంస్థ విస్తరించింది. తమిళనాడులో యాభై వేల మంది నేత కార్మికులకు, తొమ్మిది వేల మంది ఉద్యోగులకు రామ్‌రాజ్ ఉపాధి కల్పిస్తోంది.


​సంపాదనను బంగారం లేదా భూముల్లో దాచుకోకుండా తిరిగి ఉపాధి కల్పనకే వినియోగించాలనే ఉన్నతమైన సిద్ధాంతం నాగరాజన్ సొంతం. వనం ఇండియా ఫౌండేషన్ ద్వారా వేలాది మొక్కలు నాటి సామాజిక వనాలను పెంచడం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం లాంటి సేవా కార్యక్రమాలతో ఆయన సమాజానికి తిరిగి ఇస్తున్నారు. అవకాశాలు ఎవరి వద్దకూ వాటంతట అవే రావని, మనమే వాటిని సృష్టించుకోవాలని యువ పారిశ్రామికవేత్తలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. కేవలం డబ్బు కోసమే వ్యాపారం చేస్తే శాశ్వత విజయం దక్కదని, మనం చేసే పని సమాజానికి, కార్మికులకు మేలు చేసినప్పుడే అసలైన విజయం లభిస్తుందని చాటిచెప్పిన కె.ఆర్. నాగరాజన్ జీవిత ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం.