బీటలకు సిమెంట్ పూతలు.. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం...?
పనుల నాణ్యతపై అనుమానాలు.. పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు
పెద్దేముల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 18):
వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్ట్ కాలువల పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలువల నిర్మాణ పనులు పూర్తికాకముందే పలుచోట్ల బీటలు ఏర్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బీటలు ఏర్పడిన ప్రాంతాల్లో వాటిని సిమెంట్‌తో రుద్ది పూతలు పూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.కాలువల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తికాకముందే బీటలు రావడం, వాటిని శాశ్వతంగా మరమ్మతు చేయకుండా పైపూతలతో సరిచేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నిధులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ ఏది...?
ప్రాజెక్ట్ కాలువల పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ పనితీరుపై తగిన పర్యవేక్షణ లేదనే విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తయ్యేలోపే నిర్మాణంలో లోపాలు బయటపడటంపై అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
కోటపల్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, సిమెంట్ నాణ్యత, పనుల అంచనాలు, నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిందా లేదా అనే అంశాలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీటలు ఏర్పడిన ప్రాంతాలను కేవలం సిమెంట్ పూతలతో కాకుండా సాంకేతిక నిపుణుల సూచనల మేరకు నాణ్యమైన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.