☼ Suryaa News
🔴 తెలంగాణ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి..
తెలంగాణ

సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి..

14 Sep 2026 Reporter

సూర్య-గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం లెనిన్‌నగర్‌కు చెందిన మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని తాండ్ర అక్షిత రాణి(20) సింగరేణిలో అప్రెంటిస్‌షిప్‌ సందర్భంగా ఎదురైన వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందడం కలకలం రేపుతోంది.జీడీకే-2 ఇంక్లైన్‌లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్న సమయంలో ఓవర్‌మెన్‌ బొమ్మకంటి రవికుమార్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని అక్షిత రాణి ఏప్రిల్‌లో సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.కళాశాలలో చదువుతున్న సమయంలోనూ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వరుస వేధింపులు, తనకు జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదనకు గురైన అక్షిత రాణి తన బాధను లేఖలో వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 12 న ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహంతో దళిత సంఘాల నిరసన అక్షిత రాణి మృతిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మృతదేహంతో కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు. రవికుమార్‌, నవీన్‌కుమార్‌తో పాటు ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న సింగరేణి రామగుండం ఏరియా-1 జనరల్‌ మేనేజర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి సింగరేణి యాజమాన్యం న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home