ప్రధాని మోదీ పుట్టినరోజు వేళ మధ్యప్రదేశ్‌లో 3.55 కోట్ల దీపోత్సవం
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు మరియు 'సేవా సంకల్ప అభియాన్' ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ వ్యాప్తంగా గురువారం సాయంత్రం 3.55 కోట్ల 'ఆశీర్వాద దీపాలు' ఏకకాలంలో వెలిగించారు. ఈ సంబరాల ప్రధాన వేడుక ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో వైభవంగా జరిగింది. ఇక్కడ క్షిప్రా నదీ తీరంలోని ఘాట్‌లు, మహాకాల్ లోక్ కారిడార్లలో ఏకంగా 33.27 లక్షల ప్రమిదలను వెలిగించి నూతన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగిన అనంతరం రామ్‌ఘాట్ వద్ద వేలాది మంది భక్తులతో కలిసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ దీపోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ మహోత్సవంలో 25,000 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానికులు పాల్గొని క్షిప్రా హారతి సమర్పించారు. దేశానికి ప్రధాని మోదీ అందించిన పాతికేళ్ల నిరంతర సేవలకు, దేశ నిర్మాణాకి ప్రజలు తెలిపిన కృతజ్ఞతకు ఈ దీపోత్సవం నిదర్శనమని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల పాటు సాగే 'సేవా సంకల్ప అభియాన్' ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి మూలకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 845 ప్రధాన కేంద్రాల్లో ఈ ఆశీర్వాద దీపాల కార్యక్రమం ఏకకాలంలో అత్యంత కోలాహలంగా నిర్వహించబడింది.