న్యూఢిల్లీ:కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW)లో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం 2026 వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ ఏడాది "అసంక్రమిత వ్యాధులకు (NCDs) సురక్షిత సంరక్షణ" అనే ముఖ్య అంశంతో ఈ జాతీయ దినోత్సవాన్ని పాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ ఆరాధనా పట్నాయక్ మాట్లాడుతూ.. దేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు 63 శాతం అసంక్రమిత వ్యాధుల వల్లే జరుగుతున్నాయని, అందుకే NCDల నివారణ, నిర్ధారణ, చికిత్సలో రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కిచెప్పారు.
మార్చి 2027 నాటికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–ఉప ఆరోగ్య కేంద్రాలన్నింటికీ 100 శాతం జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (NQAS) ధృవీకరణ సాధించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరాధనా పట్నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ రోగి భద్రతా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు డిజిటల్ ఆరోగ్యం, మందుల భద్రతపై సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఇందులో జార్ఖండ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు NCDల నిర్వహణలో సాధించిన ఉత్తమ విధానాలను ప్రదర్శించాయి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.