న్యూఢిల్లీ:భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) అమలు చేసే చట్టాన్ని న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదించడాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఇరుదేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేయడంలో కీలక ముందడుగు అని అభివర్ణించింది. 2026 ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగ్గా, సెప్టెంబర్ 16న న్యూజిలాండ్ దీనికి చట్టబద్ధత కల్పించింది. త్వరలోనే దేశీయ ప్రక్రియలను పూర్తి చేసి ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఇరుదేశాలు సిద్ధమవుతున్నాయి.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే న్యూజిలాండ్‌కు వెళ్లే భారతీయ ఎగుమతుల్లో 100 శాతం ఉత్పత్తులకు సుంకరహిత ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారత వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రతిగా కలప, ఉన్ని, గొర్రె మాంసం వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాక, భారత్‌లోకి 20 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సేవలు, విద్యా, సాంకేతిక రంగాలు మరియు నిపుణుల ఉపాధి మార్గాలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.