కోల్‌కతా:దేశవ్యాప్తంగా 30 లక్షల మంది సంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారి నమోదుతో 'పీఎం విశ్వకర్మ' పథకం విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. కోల్‌కతాలోని ధోనో ధాన్య ఆడిటోరియంలో నిర్వహించిన పథకం మూడో వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర MSME శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నమోదైన వారిలో 24.50 లక్షల మంది ప్రాథమిక నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
లబ్ధిదారులకు ఇండియా పోస్ట్ ద్వారా 18.15 లక్షల ఆధునిక పనిముట్ల కిట్లను పంపిణీ చేయగా, 6.18 లక్షల మందికి 5 శాతం రాయితీ వడ్డీతో రూ. 5,297 కోట్ల విలువైన రూ. 1 లక్ష వరకు రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ పథకం ప్రారంభమైందని, అక్కడ 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని బీజేపీ నాయకుడు సువేందు అధికారి తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే పాల్గొన్నారు. స్థానిక కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు మరియు రూ. 1 లక్ష రుణ చెక్కులను అధికారులు పంపిణీ చేశారు.