విశాఖపట్నం, సెప్టెంబర్ 19,మేజర్ న్యూస్ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కూనూరులోని టీ బోర్డ్ ఇండియా సౌత్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో విశాఖలోని ఐనార్బిట్ మాల్‌లో శనివారం ప్రత్యేక టీ ప్రచార వేడుక ఘనంగా ప్రారంభమైంది. టీ వల్ల కలిగే ఆరోగ్య, వైద్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి, అలాగే మాల్‌ను సందర్శించే వారిలో టీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఊటీకి చెందిన చిన్న స్థాయి తేయాకు రైతు విమల లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో తమిళనాడులోని గూడూరుకు చెందిన పీ.కే. నేచురల్ ఫార్మ్స్ ప్రతినిధి పీ.కే. కుమారన్, నీలగిరి గూడూరుకు చెందిన సీఏజీ ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రతినిధి అరుణ్ తదితర ప్రగతిశీల చిన్న తేయాకు రైతులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా టీ బోర్డ్ ఇండియా డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. ఉమా మహేశ్వరి రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎం. భరణి కుమార్ IAS నేతృత్వంలో నిర్వహించారు. డాక్టర్ ఆర్. ఉమా మహేశ్వరి, తిరుమల తిరుపతి టీ నూక్ ప్రతినిధి రమానంద్ క్షేత్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నకారు తేయాకు రైతులు ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల ద్వారా, చేతితో తయారు చేసిన (హ్యాండ్‌మేడ్) టీ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. టీ బోర్డ్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్టాల్‌లో సందర్శకులు బ్లాక్ ఆర్థోడాక్స్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ (సిల్వర్ టిప్స్ టీ), ఊలాంగ్ టీ, మసాలా టీ, బాంబూ టీతో పాటు బ్లూ టీ, చమోమిలే టీ, రోజ్ టీ , హిబిస్కస్ టీ వంటి వివిధ సువాసనగల ఫ్లేవర్డ్ టీ రకాలను అందుబాటులో ఉంచారు.
ఈ ప్రదర్శన సందర్భంగా సందర్శకులందరికీ టీ బోర్డ్ ఇండియా ఉచితంగా లిక్విడ్ టీని అందిస్తోంది. సందర్శకులు సెప్టెంబర్ 20, 2026 వరకు జరిగే ఈ ప్రదర్శనకు విచ్చేసి, ఈ ప్రత్యేకమైన రుచులను ఆస్వాదించి దక్షిణ భారతదేశపు చిన్నకారు టీ రైతులకు తమ మద్దతు తెలపాలని నిర్వాహకులు కోరారు.