150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు!
‘ఒంగోలు–మన గౌరవం’ నినాదంతో భారీ కార్యక్రమాలు
లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం.. 80,350 ఇళ్ల నుంచి గంటలో వ్యర్థాల సేకరణ
81 వేల కుటుంబాలకు తడి–పొడి చెత్త వేరు చేసే బ్యాగుల పంపిణీ
మూడు నెలలుగా వరుసగా ప్రజా అవగాహన కార్యక్రమాలు
28, 29, 30 తేదీల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
సూర్య ప్రతినిధి, ఒంగోలు:
150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఒంగోలు మున్సిపాలిటీ ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేస్తూ, నగర చారిత్రక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా ఘన వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి ఈ నెల 30వ తేదీ నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నగరవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ఒంగోలు–మన గౌరవం’ నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం ఒంగోలు కబాడీపాలెం ప్రాంతంలో నిర్వహించిన మెగా సేగ్రిగేషన్ డ్రైవ్‌లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు పాల్గొన్నారు. నగరంలోని సుమారు 81 వేల కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక బ్యాగులను పంపిణీ చేశారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేసి అందించడం ద్వారా నగర పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు.
లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం..
ఒంగోలు మున్సిపాలిటీ 150వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించే లక్ష్యంతో కేవలం ఒక గంట వ్యవధిలో సుమారు 80,350 ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించే భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘స్వచ్ఛ ఒంగోలు–పచ్చని ఒంగోలు’గా నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ కార్పొరేటర్ దాచర్ల వెంకట రమణయ్య తన వార్డు, క్లస్టర్–3 పరిధిలో పాల్గొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ చెత్తను తడి, పొడిగా వేరు చేయించే కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మెగా సేగ్రిగేషన్ డ్రైవ్ ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేసి అందించడం వల్ల చెత్త నిర్వహణ సులభతరం కావడంతో పాటు నగర పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు. 150 ఏళ్ల ఒంగోలు చరిత్రను గుర్తుచేసేలా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మెగా సేగ్రిగేషన్ డ్రైవ్ ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేయడం వల్ల చెత్త నిర్వహణ మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న 150 ఏళ్ల ఒంగోలు వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని గత మూడు నెలలుగా నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 150 మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు మందులు అందించినట్లు చెప్పారు. అలాగే సుమారు 81 వేల కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
150 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఈ నెల 27న సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30న ఒంగోలు గిత్తల భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు.
మెగా సేగ్రిగేషన్ డ్రైవ్ అనంతరం కలెక్టర్ పి. రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు నగరంలోని గానుగపాలెం, ఆంధ్రకేసరి నగర్, గాంధీనగర్, కొత్త మామిడిపాలెం డంపింగ్ యార్డు ప్రాంతాల్లో పర్యటించి సేగ్రిగేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, ఎంహెచ్‌ఓ వైష్ణవి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
150 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ గత ఘనతను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పరిశుభ్రత, పచ్చదనం, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో ఒంగోలు నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి.