☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

19 Sep 2026 vizagsrinivas

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్ : మనిషి జీవితంలో పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభకార్యాలు ఎంత మంచి జ్ఞాపకాలను అందిస్తాయో.. అంతకన్నా ఎక్కువ అనుభూతిని ఉద్యోగం వచ్చిన మొదటి రోజు అందిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గర్వం, ఒక గుర్తింపు అని పేర్కొన్నారు.

విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలోని కళావాణి ఆడిటోరియంలో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ సమావేశంలో భాగస్వామ్యం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించిన 51000 మందికి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం లో జరిగిన కార్యక్రమంలో 200 మందికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలను అందించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది మంది యువత ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి పోటీ వాతావరణంలో ఈరోజు ఉద్యోగాన్ని సాధించడం ఎంతో గొప్ప విజయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ విజయానికి వెనుక నిలిచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని యువతకు సూచించారు.

“ఈ ఉద్యోగం మీ జీవితానికి, మీ వైవాహిక బంధానికి, మీ భవిష్యత్‌కు ఒక భరోసాను కల్పిస్తుంది. అయితే మీరు ఈ ఉద్యోగం ద్వారా ఏమి సాధిస్తున్నారన్నదానికంటే.. మీ ద్వారా ప్రజలు ఎంతగా లబ్ధి పొందుతున్నారన్నదే ముఖ్యమైన విషయం” అని మంత్రి స్పష్టం చేశారు.

ఉద్యోగం సాధించామనే సంతృప్తితో యువత తమ ఎదుగుదలను ఆపకూడదని ఆయన అన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిరంతరం నేర్చుకుంటూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. తమ కార్యాలయాల్లో సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ, వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని భర్తీ చేసేలా పనిచేయాలని కోరారు.

ప్రపంచం మొత్తం నేడు భారతదేశం వైపు చూస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశం సాధిస్తున్న ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రతిష్టను మరింత మెరుగుపరిచే బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని మంత్రి సూచించారు. “ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం కలిగించినప్పుడు, నెల జీతం అందుకునే సమయంలో కలిగే ఆనందం కంటే ఎక్కువ అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.

దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యువత ఆదర్శంగా తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశ ప్రగతి కోసం ఆయన చూపుతున్న అంకితభావం, నిరంతర శ్రమ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

అదేవిధంగా కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటూ, భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి సారిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆయన.. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకుంటూ యువత ముందుకు సాగాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, సీబీఐసీ చీఫ్ కమిషనర్ ఎన్. శ్రీధర్, ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ దండా శ్రీనివాస్, ఐఆర్‌ఎస్ అధికారి, ప్రిన్సిపల్ కమిషనర్ కేవీవీజీ దివాకర్, ఎల్.వి.వి.ఎస్. పాత్రుడు, అడిషనల్ కమిషనర్ ఎన్. బలరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home