నంద్యాల అర్బన్:
నంద్యాల క్రాంతినగర్‌లోని శ్రీ శాంతినికేతన్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.
శ్రీ సత్యసాయి జిల్లా అమెచ్యూర్ బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని రామలక్ష్మణ్ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు 8వ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో నంద్యాల జిల్లా జట్టు తరఫున శ్రీ శాంతినికేతన్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సి. అరవింద్, కె. అజయ్ ప్రాతినిధ్యం వహించారు.
ఈ టోర్నమెంట్‌లో నంద్యాల జట్టు సమష్టిగా రాణించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అరవింద్, అజయ్ బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ శ్రీ సుధాకర్ గారు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి పాఠశాలకు, నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా వీరు రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ), సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్