రష్యా ఉప ప్రధానితో నిర్మలా సీతారామన్ భేటీ
పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చలు
న్యూఢిల్లీ:18వ బ్రిక్స్ సదస్సు వేదికగా భారత్-రష్యాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు అడుగులు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం న్యూఢిల్లీలో రష్యా ఫెడరేషన్ ప్రథమ ఉప ప్రధాన మంత్రి డెనిస్ మంటురోవ్‌తో సమావేశమయ్యారు.
ఈ భేటీలో ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 'ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం' (BIT)పై చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనివల్ల రెండు దేశాల వ్యాపార వర్గాలకు ఆర్థిక భద్రతతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఆర్థిక సేవల రంగంలో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరునేతలు చర్చించారు.
పుతిన్ రాకతో పెరిగిన ప్రాధాన్యత
ఈ చర్చల సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకోవడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరింది. విమానాశ్రయంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం ఉభయ నేతలు భారత్, రష్యా పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'ఇన్నోప్రోమ్ ఎగ్జిబిషన్'ను సందర్శించనున్నారు.
కాగా, "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది.