సెప్టెంబర్ 18న థియేటర్లలోకి ‘పిఠాపురంలో… అలా మొదలైంది’.. తండ్రీకూతుళ్ల అనుబంధంతో రాబోతున్న ఫీల్ గుడ్ మూవీ!
ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర తెరకెక్కించిన తాజా కుటుంబ కథా చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. లవ్, కామెడీ, సెంటిమెంట్ కలబోతగా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు.
హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, జయవాహిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధం, సునిశితమైన హాస్యం, యువతకు అవసరమైన చక్కటి సందేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. మన చుట్టూ జరిగే సహజమైన సంఘటనల ఆధారంగా సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పారు. ఈ చిత్రానికి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కూడా ఇందులో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించిందని, కుటుంబ సమేతంగా వచ్చి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ ఏదోటి స్టోరీ డెవలప్‌మెంట్ & డైలాగ్స్ అందించగా, జి.సి. క్రిష్ సంగీతం సమకూర్చారు.