☼ Suryaa News
🔴 తెలంగాణ పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు
తెలంగాణ

పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు

21 Sep 2026 Purushotham

పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు

రూ.4.20 లక్షల అక్రమ వసూళ్లు.. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

మహబూబాబాద్, సెప్టెంబర్ 21(మేజర్ న్యూస్, సూర్య)     
పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్‌లో బెదిరించి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ (29), చింతలచేరువు ప్రశాంత్ (26)ను అరెస్ట్ చేసి, వారి నుంచి మొబైల్ ఫోన్, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. కేసముద్రం మండలానికి చెందిన బంగారు వ్యాపారి బోగోజు వేణుగోపాల చారి నంబర్‌ను గూగుల్ ద్వారా సేకరించిన ఇర్ఫాన్.. పోలీస్ యూనిఫాంలో ఫొటో తీసుకుని వాట్సాప్ , ట్రూకాలర్లో డీపీగా పెట్టుకున్నాడు. అనంతరం వికారాబాద్ సమీపంలోని పార్వతీపురం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా పరిచయం చేసుకుని, దొంగిలించిన బంగారం కొనుగోలు చేశావంటూ వ్యాపారిని బెదిరించాడు. అరెస్ట్ చేస్తామని భయపెట్టి వాట్సాప్  ద్వారా క్యూఆర్ కోడ్ పంపి రూ.88,026 వసూలు చేశాడు. కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, ఎస్‌ఐ కె. క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ పోర్టల్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. సెప్టెంబర్ 20న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బంగారు వ్యాపారులను ఇదే విధంగా బెదిరిస్తూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు సుమారు రూ.4.20 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. పోలీసుల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపులు, QR కోడ్‌లు, ఆన్‌లైన్ డబ్బు డిమాండ్లకు స్పందించవద్దని ఎస్పీ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని కోరారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home