☼ Suryaa News
🔴 తెలంగాణ బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

20 Sep 2026 Hareesh

             తెలంగాణ బ్యూరో ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హరీశ్‌రావు హైదరాబాద్‌ చుట్టూ ఫామ్‌హౌస్‌లు, గచ్చిబౌలిలో విల్లాలు, సిద్దిపేటలో భూములు సమకూర్చుకున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వంపై, రైతుల సమస్యలపై హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలోనూ వర్షాల కొరత ప్రభావం కనిపిస్తోందని ఐలయ్య పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో విద్యుత్‌ ఉత్పత్తిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితులు లేకపోయినా రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయలేదని ఐలయ్య ఆరోపించారు. అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సబ్‌స్టేషన్‌కు వెళ్లి లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్‌ సరఫరాపై వాస్తవాలను బయటపెట్టారని చెప్పారు.
కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సిన హరీశ్‌రావు, కేటీఆర్‌ రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా రైతులకు ధైర్యం కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని అన్నారు.
“ఏ మొహం పెట్టుకుని హరీశ్‌రావు ఆలేరుకు వచ్చారు? బీఆర్‌ఎస్‌ హయాంలో ఆలేరుకు అన్ని విధాలా అన్యాయం చేశారు” అని బీర్ల ఐలయ్య విమర్శించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home