☼ Suryaa News
🔴 తెలంగాణ సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును ఛేదించిన గోదావరిఖని పోలీసులు
తెలంగాణ

సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును ఛేదించిన గోదావరిఖని పోలీసులు

20 Sep 2026 karimnagarvenkatesh

 

ప్రేమ ,ఈర్ష్యే హత్యకు కారణం...

పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య, సాంకేతిక ఆధారాలతో నిందితుల అరెస్ట్

 

సూర్య పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ::

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జెట్టి నవీన్ కుమార్‌ను,సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న వ్యక్తిని, ఈరోజు ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ను ఓసీపీ-05 గని వద్ద అదుపులోకి తీసుకున్నారు.

*నిందితుల వివరాలు*

A-1.జెట్టి నవీన్ కుమార్
తండ్రి పేరు: కొమురయ్య
38 సం.లు
కులం: ముదిరాజ్
వృత్తి: సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల,సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకుడు
నివాసం: ఇంటి నం. 7-57/1, జీపీ రావు కాలనీ,గారెపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం.

A-2.బొమ్మకంటి రవికుమార్
తండ్రి పేరు: సత్తయ్య
35 సం.లు
కులం: బీసీ-బి (పద్మశాలి)
వృత్తి: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2 & 2A ఇన్‌క్లైన్ గనిలో ఓవర్‌మన్
నివాసం: ఇంటి నం. 3-2, బుద్ధ ఖుర్ద్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.

*పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు*

- నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు
- నిందితులకు చెందిన రెండు సెల్‌ఫోన్లు
- ఒక ట్యాబ్

*వివరాల్లోకి వెళితే...*

గత శనివారం, 12-09-2026న గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు,కాల్ డేటా,కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించారు.ఈ ఆధారాల ద్వారా నిందితుల కదలికలను గుర్తించి కేసును ఛేదించారు.
ప్రధాన నిందితుడు నవీన్ కుమార్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కళాశాలకు వచ్చే క్రమంలో యువతితో అతనికి పరిచయం ఏర్పడి,అనంతరం అది సన్నిహిత సంబంధంగా మారింది.ఈ సంబంధాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలని నవీన్ కుమార్ భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యువతి డిప్లొమా పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చింది.ఈ సమయంలో ఆమెకు బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది.యువతి నవీన్ కుమార్‌కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేకపోయాడు.దీంతో యువతిపై అతనికి తీవ్ర ఆగ్రహం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ నేపథ్యంలో యువతిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న నవీన్ కుమార్, 12-09-2026న ముందస్తు ప్రణాళికతో పురుగుల మందును ఒక నీటి సీసాలో నింపుకుని తన ఎకోస్పోర్ట్ కారులో ఉంచుకున్నాడు. అదే రోజు సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వెళ్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులో ఎక్కించుకున్నాడు.
అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్,ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.రవికుమార్ తనపై అత్యాచారం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్ రాయించాడు.ఆ నోట్‌ను ఆమె ఫోన్‌తో ఫొటో తీసిన అనంతరం, ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగుల మందును యువతికి బలవంతంగా తాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.పురుగుల మందు తీసుకోవడంతో యువతి కారులోనే స్పృహ కోల్పోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ,తన నేరం బయటపడుతుందనే భయంతో నవీన్ కుమార్ ఉద్దేశపూర్వకంగా వైద్య సహాయం అందించడంలో జాప్యం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యువతి వెంటనే మృతి చెందకపోవడంతో నవీన్ కుమార్ కొంతసేపు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ వైద్య సహాయం అందించడంలో ఆలస్యం చేశాడు. అనంతరం యువతి స్పృహ కోల్పోయిన తరువాత ఆమె మొబైల్ ఫోన్ నుంచి ఆమె తండ్రికి ఫోన్ చేసి,ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రాత్రి సుమారు 7:30 నుంచి 7:45 గంటల మధ్య యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం నవీన్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది.
యువతి మృతితో తన నేరం బయటపడుతుందనే భయంతో నవీన్ కుమార్ నేరానికి ఉపయోగించిన కారును కడిగినట్లు, సూసైడ్ నోట్, పురుగుల మందు సీసా, మొబైల్ సిమ్ కార్డులను తొలగించి ఆధారాలు లభించకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా,కాల్ రికార్డులు,ఇతర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించారు.వీటి ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా బొమ్మకంటి రవికుమార్‌పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలు శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చిన సమయంలో రవికుమార్ ఆమెతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగినట్లు, అనంతరం ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.అలాగే మృతురాలు సింగరేణి అధికారులకు సమర్పించిన దరఖాస్తు,ఆ దరఖాస్తుపై తీసుకున్న చర్యలు, సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణలు, రవికుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
సంబంధిత వార్తలు
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

🕑 20 Sep 2026
తెలంగాణ

నేను ఎవరి బాణాన్ని కాదు.. బహుజనుల గొంతుకను: కొడంగల్ సభలో కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ

🕑 20 Sep 2026
తెలంగాణ

ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..

🕑 20 Sep 2026
తెలంగాణ

దళితుల భూమి ఒక్క అంగుళం కూడా తీసుకోబోం.. మంత్రి పొంగులేటి

🕑 20 Sep 2026
తెలంగాణ

సనత్‌నగర్‌ టీమ్స్ ఆసుపత్రి లో భారీ చోరీ లక్షల విలువైన వైద్య పరికరాలు అపహరణ 288 వైద్య పరికరాలు మాయం ఇది ఇంటి దొంగల పనేనా..? అని అనుమానాలు

🕑 20 Sep 2026
తెలంగాణ

దానం కు ఉపఎన్నికలు కలిసి రావు ఖైరతాబాద్‌లో మళ్లీ పోటీ చేస్తే ఓటమి తప్పదు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఉపఎన్నిక జరిగితే బీజేపీ విజయం తథ్యం అని ధీమా దానం నాగేందర్‌పై పలు తీవ్ర వ్యాఖ్యలు

🕑 20 Sep 2026
Advertisement
↗ Full Article ← Home