న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత భవిష్యత్తు” అనే రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెప్టెంబర్ 19, 20 తేదీలలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారతదేశంతో పాటు 17 దేశాలకు చెందిన పర్యావరణ నిపుణులు, న్యాయవ్యవస్థ ప్రతినిధులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు భాగస్వాములవుతున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవలతో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ, వాతావరణ సవాళ్లను అధిగమించేందుకు విధాన రూపకల్పన, అమలులోని లోపాలను పరిశీలించడం, ఉత్తమ విధానాలను పంచుకోవడం మరియు సంస్థల మధ్య సహకారాన్ని పెంచడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఎన్‌జీటీ తెలిపింది. ఈ రెండు రోజుల్లో కీలక పర్యావరణ సమస్యలపై నాలుగు సాంకేతిక సమావేశాలు జరగనుండగా, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. కాగా, ఆదివారం జరిగే ముగింపు సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.