☼ Suryaa News
🔴 జాతీయం టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు
జాతీయం

టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు

19 Sep 2026 vasu

రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:భారతదేశ స్టార్టప్ వ్యవస్థ ఇకపై కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, దేశ నూతన ఆర్థిక వ్యవస్థలో చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన 20వ ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించిందని, దేశంలో గుర్తింపు పొందిన మొత్తం స్టార్టప్‌లలో దాదాపు సగం టైర్-2, టైర్-3 నగరాల్లోనే కేంద్రీకృతమై ఉండటం విశేషమని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు ₹1 లక్ష కోట్లతో 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన'ను ప్రారంభించామని, దీని ద్వారా తొలిసారి ఉద్యోగంలో చేరే దాదాపు 2 కోట్ల మంది యువతకు ₹15,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా బాధ్యతలు చేపడుతున్న ఉద్యోగులు పౌరులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం తెచ్చిన 'iGOT కర్మయోగి' ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే 1.70 కోట్లకు పైగా సిబ్బంది చేరారని, కొత్త ఉద్యోగులు కూడా నిరంతరం నేర్చుకుంటూ తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home