న్యూఢిల్లీ:వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నియామక పత్రాలను అందజేశారు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 20వ ‘రోజ్‌గార్ మేళా’లో ఆయన పాల్గొని ఈ నియామక పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ, 2047 నాటికి భారత్‌ను వికసిత భారత్‌గా తీర్చిదిద్దే ప్రయాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలలో ఈ నియామకాలు కొత్త వెలుగులు నింపాయని, అభ్యర్థుల కష్టానికి, వారి తల్లిదండ్రుల త్యాగాలకు దక్కిన గుర్తింపు ఇది అని పేర్కొన్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులు సమాజం, తోటి పౌరుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, “నాగరిక్ దేవో భవ” అనే సూత్రాన్ని పాటిస్తూ పౌర కేంద్రీకృత పాలన అందించాలని పిలుపునిచ్చారు.
గ్లోబల్ అవకాశాలు మరియు దేశీయ నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుతూ.. దాదాపు 40 దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అలాగే ఇటీవల బ్రిక్స్ సదస్సులో తీసుకొచ్చిన పోర్టల్‌లు భారతీయ పారిశ్రామికవేత్తలకు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా యువతను సిద్ధం చేసేందుకు జాతీయ విద్యా విధానం, స్కిల్ ఇండియా మిషన్, రూ. 60,000 కోట్ల అంచనా వ్యయంతో 1,000 ఐటీఐలను ఆధునీకరించే 'పీఎం-సేతు' వంటి పథకాలను ప్రభుత్వం వేగవంతం చేసిందని వివరించారు.
స్టార్టప్‌లు, ఉపాధి కల్పన రంగాలలో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రధాని ప్రస్తావిస్తూ.. దేశంలో నమోదైన స్టార్టప్‌లలో సగానికి పైగా టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, గ్రామీణ ప్రాంత యువత కూడా సొంత ఆలోచనలతో కంపెనీలు స్థాపించి ఉపాధిని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ రంగంలో దాదాపు 2 కోట్ల మంది యువతకు తొలిసారి ఉపాధిని కల్పించే లక్ష్యంతో రూ.1 లక్ష కోట్లతో 'ప్రధాన మంత్రి విక్సిత్ భారత్ రోజ్‌గార్ యోజన'ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ₹15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత్ మొదటి త్రైమాసికంలో 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును, పెట్టుబడులలో 12 శాతం పెరుగుదలను నమోదు చేసిందని ప్రధాని గుర్తుచేశారు. ఐగాట్ (iGOT) కర్మయోగి వేదిక ద్వారా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సరళమైన, వేగవంతమైన పాలనను అందించాలని నూతన ఉద్యోగులకు సూచించారు.