మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి
అనంతపురం బ్యూరో
మద్యం సేవించేందుకు డబ్బులు లేక క్షణికావేశానికి లోనైన ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన అనంతపురం–ప్రసన్నాయపల్లి రైల్వే మార్గంలో చోటుచేసుకుంది.
బుక్కరాయసముద్రం మండలం ఎల్‌బీ కాలనీకి చెందిన పోతి మాల రవి (35) బేల్దారీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2019లో అనంతపురానికి చెందిన సాయి లీలను వివాహం చేసుకున్న రవికి బసవరాజు (7), భవాని (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా మద్యపానానికి బానిసైన రవి, తాను సంపాదించిన కూలి డబ్బుల్లో ఎక్కువ భాగాన్ని మద్యానికే ఖర్చు చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
సుమారు నాలుగు నెలల క్రితం భార్యకు చెప్పకుండా అనంతపురానికి వచ్చిన రవి, తన మేనల్లుడు కుమార్‌తో కలిసి ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న మధ్యాహ్నం భార్య సాయి లీల, మేనల్లుడు కుమార్‌కు ఫోన్ చేసి మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వాలని అడిగాడు. వారి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు.
అదే రోజు అర్ధరాత్రి ప్రసన్నాయపల్లి–అనంతపురం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై గుర్తుతెలియని రైలు/గూడ్స్ రైలు కింద పడి రవి మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మేనల్లుడు కుమార్, సాయి లీలకు సమాచారం అందించాడు. అనంతరం వారు అనంతపురం GGH మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని రవి దిగా గుర్తించారు.
మద్యపానానికి డబ్బులు లేకపోవడంతో రవి క్షణికావేశంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పంచాయితీదారులు పేర్కొన్నారు. మృతికి ఇతర కారణాలు గానీ, ఎవరిపైనైనా అనుమానాలు గానీ లేవని వారు తెలిపారు. సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.