☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన

19 Sep 2026 Reporter

అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన

వర్షాభావంపై శాస్త్రీయ అంచనా.. పంట నష్టం నివారణకు ముందస్తు చర్యలు

513 మండలాల్లో కరువు ఛాయలు.. 268 మండలాల్లో తీవ్ర పరిస్థితులు

సూక్ష్మ సేద్యం, ప్రకృతి సాగుకు అత్యధిక ప్రాధాన్యత

ఉద్యాన పంటలకు రూ.190 కోట్లు.. ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం

తాగునీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ

సూర్య స్టేట్, బ్యూరో : 

 రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతి నెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని అధికారులకు సూచించారు. వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, శాటిలైట్‌ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

513 మండలాల్లో కరువు ఛాయలు: 2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 513 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా, 245 మండలాల్లో మోస్తరుగా ఉందన్నారు. కరువు పరిస్థితులపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలించి నివేదికలు అందించనున్నాయి. అనంతరం వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పించనుంది. కరువు ప్రతిపాదనలను రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖకు జిల్లా కలెక్టర్లు సమర్పించాల్సి ఉండగా.. ఇందుకు సెప్టెంబర్‌ 24ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 29న రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో పరిశీలించనున్నారు.

ఉద్యాన పంటలకు రూ.190 కోట్లు: వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్‌నినో ప్రభావం కూడా ఉద్యాన పంటలపై పడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలోని పంటలు హైరిస్క్‌ కేటగిరీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో 17,916 హెక్టార్లలో సాగవుతున్న నారింజ, బత్తాయి, మామిడి, ఎర్రమిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు సూక్ష్మ సేద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఏపీఎంఐపీ కింద రైతులకు సంబంధించిన నాలుగు కీలక సేవలను ‘మన మిత్ర’ వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సూక్ష్మ సేద్యంతో పాటు ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు: రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లో అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి విశాఖ తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. విశాఖ సమీపంలోని రిజర్వాయర్లను నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. మేఘాద్రిగడ్డకు పోలవరం ఎల్‌ఎంసీ నుంచి ప్యాకేజీ నంబర్‌–8 కింద పైపులైన్‌ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. విశాఖ నగరానికి మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home