పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 4.82 శాతానికి చేరినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ (MoSPI) వెల్లడించింది. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, సరుకుల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతంగా నమోదైంది.
పట్టణ ప్రాంతాల (4.31%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (5.23%) ధరల భారం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక వివిధ రంగాల వారీగా పరిశీలిస్తే.. వ్యక్తిగత సంరక్షణ, అనుబంధ సేవల విభాగంలో అత్యధికంగా 15.17 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, రెస్టారెంట్ సేవలు 8.38 శాతం, రవాణా రంగం 4.60 శాతం మేర ప్రియమయ్యాయి. విద్యుత్, గ్యాస్, ఇంధనం 2.61 శాతంగా నమోదు కాగా, ఆరోగ్య రంగం అత్యల్పంగా 1.34 శాతంతో స్వల్పంగా పెరిగింది.