☼ Suryaa News
🔴 తెలంగాణ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?
తెలంగాణ

ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?

20 Sep 2026 karimnagarvenkatesh
 ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిది?… ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోండి… 22ఏతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు..  అవసరమైతే న్యాయపోరాటం… ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేస్తాం… బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. కాంగ్రెస్ మాకు పోటీ కాదు… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్… సూర్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి ::  కేసీఆర్ ఫాంహౌజ్ భూముల సందర్శనకు కాంగ్రెస్ నేతలు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అధికార పార్టీ నేతలు ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే అధికారులను పంపించి వాటిని స్వాధీనం చేసుకోవాలని, భూదోపిడీకి సంబంధించిన ఆధారాలను పత్రాలతో సహా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22ఏను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని విమర్శించిన ఆయన, ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఎదుర్కొంటామని, ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అన్నారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని, వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కొత్త ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లను బండి సంజయ్ అందజేశారు. ప్రతి డివిజన్‌కు చెత్త సేకరణ కోసం ఒక ట్రైసైకిల్‌ను అందిస్తున్నామని, అదనంగా ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపనున్నామని, రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు ప్రారంభం కానున్నాయని, రూ.80 కోట్ల యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు, మరో రూ.16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు అదనపు బడ్జెట్ కేటాయించామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించి పోలీసులకు సహకరించాలని కోరారు. కరీంనగర్ ప్రశాంతతకు మారుపేరని మరోసారి నిరూపిద్దామని పిలుపునిచ్చారు.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home