☼ Suryaa News
🔴 తెలంగాణ తాండూరులో దొంగల దండయాత్ర...!
తెలంగాణ

తాండూరులో దొంగల దండయాత్ర...!

16 Sep 2026 Reporter


పది రోజుల్లో నాలుగు చోరీలు.. పట్టపగలే మరో భారీ దొంగతనం
10 తులాల బంగారం.. రూ.3 లక్షల నగదు అపహరణ
కూతురి కాలేజీ ఫీజు కోసం దాచిన డబ్బు కూడా గాయబ్
వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు.. పోలీసులకు సవాల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 16): తాండూరు పట్టణ పరిసరాల్లో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా బుధవారం పట్టపగలే మరో భారీ చోరీ జరగడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
అయ్యప్పనగర్‌లో పట్టపగలే చోరీ

కోకట్ రోడ్డు మార్గంలోని అయ్యప్పనగర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదును అపహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తమ కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించేందుకు ఎంతో కష్టపడి దాచుకున్న నగదు సైతం దొంగల పాలవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి దొంగలు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగంలోకి పోలీసులు

చోరీ విషయం తెలుసుకున్న వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ, ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

వరుస ఘటనలతో కలవరం

ఇదిలా ఉండగా ఈ నెల 3, 14 తేదీల్లోనూ తాండూరు పరిసరాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తాజాగా అయ్యప్పనగర్‌లో పట్టపగలే చోరీ జరగడంతో వరుస ఘటనలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

భద్రత పెంచాలని విజ్ఞప్తి

వరుస చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచి ప్రజలకు భద్రతా భావం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చోరీల పరంపర రూరల్ పోలీసులకు సవాల్‌గా మారిందని, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home