.శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించాలి..
..అధికారులకు సహకరించాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్..
సూర్య మెట్‌పల్లి:-
వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. భక్తులు, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
మెట్‌పల్లి పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జనం కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను శోభాయాత్రగా తరలించి నిమజ్జనం నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.నిమజ్జన ప్రాంతంలో విద్యుత్ దీపాలు, వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వినాయక నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.