☼ Suryaa News
🔴 తెలంగాణ కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు
తెలంగాణ

కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు

17 Sep 2026 Reporter

వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన’ అంటూ నిరసన

విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందించాలని డిమాండ్‌.. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

దోమ,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 17):వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ రైతులు గురువారం రోడ్డెక్కారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ మోత్కూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ‘వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలు చేశారు.రైతులు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు బోరుబావులపై ఆధారపడుతున్నామని తెలిపారు. పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం ప్రకటిస్తున్న విద్యుత్‌ సరఫరాకు, క్షేత్రస్థాయిలో అందుతున్న సరఫరాకు పొంతన లేదని ఆరోపించారు.‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదు’, ‘రైతు ఏడిస్తే రాజ్యమే ఏడుస్తుంది’ అంటూ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్యపై ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతోనే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో రైతులు, విద్యుత్‌ అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 

సమస్య పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని రైతులు స్పష్టం చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పక్కకు వెళ్లాలని రైతులను కోరినప్పటికీ, విద్యుత్‌ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన కొనసాగించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మోత్కూర్‌ గ్రామానికి వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా, నిరంతరాయంగా అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొంటూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ ఆందోళనలో మోత్కూర్‌ గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home