తెలంగాణ బ్యూరో ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ దాన కిశోర్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓఝా, పంచాయతీరాజ్ ఈఎన్సీ జగదీష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.
9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు
రాష్ట్రంలో మొత్తం 9,745 గ్రామ సమైక్య భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 534 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మరో 6,141 భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 3,070 భవనాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని మంత్రికి వివరించారు.పనులు ప్రారంభం కాని భవనాలకు సంబంధించి కారణాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
3,906 గ్రామపంచాయతీ భవనాలకు మంజూరు
రాష్ట్రంలో 3,906 గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటికే 444 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన 3,444 భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
గ్రామపంచాయతీ భవనాలు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు కీలకమైన మౌలిక వసతులని పేర్కొన్న మంత్రి, నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
అంగన్వాడీ భవనాల నిర్మాణంపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రంలో 2,313 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 200 భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన 2,113 భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున వాటి నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని రకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకునేలా చర్యలు
అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అదనపు నిధులను సమీకరించేందుకు ఎంపీ లాడ్స్ నిధులను కూడా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంపీలకు తానే లేఖలు రాయనున్నట్లు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి కనీసం రూ.1 కోటి చొప్పున కేటాయించేలా ఎంపీలను కోరుతూ లేఖలు రాయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ.8 లక్షల వరకు వినియోగించుకునే అవకాశం ఉందని, మిగిలిన రూ.4 లక్షల కోసం అందుబాటులో ఉన్న ఇతర నిధులను వినియోగించాలని కలెక్టర్లను మంత్రి కోరారు.
శాఖల మధ్య సమన్వయం పెంచాలి
గ్రామీణ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. నిధులు, స్థలం, అనుమతులు, సాంకేతిక అంశాలు తదితర కారణాలతో పనులు ఆలస్యం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రతి నెలా పనుల పురోగతిపై సమీక్ష
నిర్మాణ పనుల పురోగతిని ఇకపై క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి నెలా నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మంజూరైన పనుల్లో ఏవి పూర్తయ్యాయి, ఏవి పురోగతిలో ఉన్నాయి, ఇంకా ప్రారంభం కాని పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అనే అంశాలపై ప్రతి సమీక్షలో వివరాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హ్యామ్ విధానంలో రోడ్ల పనులు దసరాలోపు ప్రారంభించాలి
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రి సీతక్క సమీక్షించారు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులను దసరాలోపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీల వారీగా రోడ్ల నిర్మాణ పనుల పురోగతి, కాంట్రాక్ట్ కంపెనీల సన్నద్ధత, అవసరమైన ఏర్పాట్లపై మంత్రి అధికారులతో చర్చించారు. సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీలు పనులు ప్రారంభించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మంజూరైన పనులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వేగంగా అమలు కావాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.