పర్యావరణ పరిరక్షణతో పాటు వెదురు ఆధారిత వృత్తులను ప్రోత్సహించాలి .
ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించిన అదనపు కలెక్టర్లు సంగీత ,పాండు .
సంగారెడ్డి, ; వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు సంగీత, పాండు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెదురుతో తయారు చేసిన వివిధ రకాల వస్తువుల ప్రదర్శనను అదనపు కలెక్టర్లు తిలకించారు. వెదురు ఉత్పత్తుల తయారీ, వాటి వినియోగం, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో వెదురు మొక్కలు, వెదురు ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు వెదురు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.మేదర సామాజిక వర్గానికి చెందిన అనేక మంది వెదురు ఆధారిత వృత్తిని జీవనాధారంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వృత్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వెదురుతో వివిధ రకాల ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వెదురు ఉత్పత్తుల తయారీకి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అదనపు కలెక్టర్లు అన్నారు. విద్యతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కాలానుగుణంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏ. జగదీష్,అదనపు డి ఆర్ డి ఓ బాల్ రాజ్,మాజీ మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి, మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు అంబదాస్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, జిల్లా కోశాధికారి పులి రాజేష్ కుమార్, నాయకులు ఆంజనేయులు, రమేష్, నరేందర్, ప్రమోద్ కుమార్, సాయి మల్లేష్, శ్రీలత, జగదాంబ, సంతోషి, రజిని, మమత, బిక్షపతి, సిబ్బంది, మేదర సామాజిక వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.