ఎల్ నినో ప్రభావం నుంచి ప్రజలను కాపాడాలని వేడుకోలు
తిరుమల :తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన తన మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ — "శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించాను" అని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ — "ప్రకృతి పరంగా వస్తున్న ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి పంటలు, నదులు, తాగునీరు మరియు సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు గానీ, ప్రజల జీవన విధానానికి గానీ ఎటువంటి ఆటంకం కలగకూడదని ఆ స్వామివారిని వేడుకున్నాను. ప్రకృతి వైపరీత్యాల నుంచి దేశాన్ని, రాష్ట్రాలను కాపాడి సుభిక్షంగా ఉంచాలని శ్రీవారిని ప్రార్థించాను" అని పేర్కొన్నారు.