-ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి
- ఆధ్వర్యంలో నంద్యాలలో నిరాహార దీక్ష
నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ SDPI ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్‌లో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SDPI నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు 2 సెంట్ల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని, నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను వెంటనే తరలిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాలలోని కుందూనదిపై నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం సందర్భంగా నంద్యాలలో పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కూడా వెంటనే నెరవేర్చాలని కోరారు. CPI నాయకులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, శ్రీశైలాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా టిడ్కో గృహాలను పూర్తిస్థాయిలో నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. నంద్యాల అసెంబ్లీ SDPI అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ, నంద్యాల మున్సిపల్ సిబ్బంది వేధింపుల కారణంగా మృతి చెందిన ఆర్మీ జవాన్ దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన కుమార్తెకు ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో వ్యాపారస్తులకు గేట్ల ఇబ్బందులు లేకుండా చూస్తామని, నందికొట్కూరు కుమ్మరి ఏరియాలో ప్రజల మధ్య ఉన్న డంపింగ్ యార్డును తొలగిస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమెన్ ఇండియా మూమెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ నయూమున్నీసా మాట్లాడుతూ, బాలికల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల కోసం కేటాయించిన 6 మైనారిటీ భవనాలను జిల్లా పరిషత్‌కు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. MLC ఇసాక్ భాష మాట్లాడుతూ, నూనెపల్లె మార్కెట్ యార్డులో రైతులకు చెందిన 2 ఎకరాల భూమిని టీడీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించే నిర్ణయాన్ని రద్దు చేయాలని అన్నారు. అలాగే వక్ఫ్ ఆస్తులను కోర్టు కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం తదితర ప్రభుత్వ అవసరాలకు కేటాయించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి పోరాట సమితి నాయకులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన నంద్యాల జిల్లా రైతులను ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం అందించాలని నాయకులు కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే, ప్రజల తరఫున SDPI నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చిన వారిలో IUML నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరిముల్లా మస్తాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, RPS నాయకులు శివరామకృష్ణ, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులు మన్యం జానయ్య, ముస్లిం ఐక్యవేదిక నాయకులు పెద్ద మున్న, సీనియర్ అడ్వకేట్ శంకరయ్య, అడ్వకేట్ శ్రీనివాసులు, YCP పార్టీ మాజీ చైర్ పర్సన్ గంగిశెట్టి శ్రీధర్, యువజన విభాగం నాయకులు సాయి కృష్ణ, మహిళా విభాగం నాయకురాలు శశికళ, మరియు వైసీపీ పార్టీ మాజీ కౌన్సిలర్ లు, మైనార్టీ నాయకులు, SDPI జిల్లా, అసెంబ్లీ నాయకులు, WIM నాయకులు, యంగ్ డెమొక్రాట్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.