☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్

జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

20 Sep 2026 Hareesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలోను, క్లిష్టమైన ఎన్నికల సమయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోను కందుల దుర్గేష్‌కు ఉన్న అపార రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అధినేత పవన్ కళ్యాణ్ ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ నియామకంతో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

తనపై నమ్మకంతో ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధినాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతను అత్యంత అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అగ్ర నాయకత్వం మొదలుకుని వీర మహిళలు, జనసైనికులు, బూత్ స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ స్థానిక సంస్థల సమరానికి పార్టీ కేడర్‌ను సంపూర్ణంగా సన్నద్ధం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో, పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ చేరవేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పటిష్ట కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home