ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ జిల్లా. రెండో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 07:02 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు రవాణా రంగంలో ఒక గొప్ప శుభవార్త అందుతోంది. జిల్లా మీదుగా మరో సరికొత్త జాతీయ రహదారి రాబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెంతో అనుసంధానించే జాతీయ రహదారి 930పీ నిర్మాణ పనుల్లో ఇప్పుడు కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ (3డీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది జిల్లా ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది.


రెండో జాతీయ రహదారిగా రికార్డు..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండా వెళ్లే రెండో జాతీయ రహదారిగా ఇది నిలవనుంది. ఇల్లెందు మరియు కొత్తగూడెం మధ్య ఉన్న మూడు మండలాల్లోని సుమారు 4.85 హెక్టార్ల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల, టేకులపల్లి మండలంలోని బేతంపూడి, గొల్లపల్లి మరియు లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ వంటి గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఈ భూములకు సంబంధించి మార్కెట్ విలువ ప్రకారం రైతులకు త్వరలోనే నష్టపరిహారం చెల్లించనున్నారు.


ప్రస్తుతం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే ఖమ్మం లేదా సూర్యాపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కానీ ఈ కొత్త జాతీయ రహదారి 930పీ అందుబాటులోకి వస్తే.. ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు, వలిగొండ మీదుగా నేరుగా హైదరాబాద్‌లోని గౌరెల్లి జంక్షన్‌ను చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుంది.


ఈ రహదారి కేవలం ప్రయాణికులకే కాకుండా.. పారిశ్రామిక రవాణాకు వెన్నెముకగా మారుతుంది. జిల్లాలో ఉన్న మైనింగ్, యంత్రాల రవాణా సులభతరమవుతుంది. అలాగే, హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్లే భక్తులకు కూడా ఇది సులభమైన ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది. అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన వారికి ఈ రోడ్డు ఒక వరప్రదాయినిలా మారనుంది. ప్రమాదాలను తగ్గించేలా ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తుండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa