వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఫార్మా సిటీ కోసం భూసేకరణపై జరిగిన ప్రజా విచారణ సందర్భంగా నిరసన తెలిపిన రైతులను పోలీసులు కొట్టి, శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ నిర్ధారించింది. ఈ మేరకు కమిషన్ తాజాగా నివేదికను విడుదల చేసింది.
2024 నవంబర్‌లో వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఫార్మా సిటీ భూసేకరణపై ప్రజా విచారణకు లగచర్లకు వచ్చినప్పుడు, గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొందరు రైతులు అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్లకు చెందిన పలువురు రైతులను అరెస్టు చేసి, పోలీసులు వారిని శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తులో తేలింది.
నిరసన జరిగిన సమయంలో సంఘటన స్థలంలో లేని అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారని, అంతేకాకుండా ఇళ్లలో ఉన్న మహిళలను కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారని నివేదిక పేర్కొంది. కొందరు మహిళలు లైంగిక వేధింపులకు కూడా గురయ్యారని ఆరోపించారు. ఒక మహిళకు ఎడమ తొడపై (4సీఎం x 5 సీఎం) గాయమైందని డాక్టర్ ధృవీకరించారు. రాత్రిపూట అరెస్టు చేసిన గ్రామస్థులను పరిగి పోలీస్ స్టేషన్‌లో కొట్టి, హింసించారని, మేజిస్ట్రేట్ ముందు ఈ హింస గురించి చెప్పవద్దని పోలీసులు వారిని బెదిరించారని ఎన్హెచ్ఆర్సీ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.
ఈ ఘటనలో రాజకీయ కక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని, ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా వారిని అరెస్టు చేసి హింసించారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపై కూడా కేసు నమోదు చేయలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని నివేదికలో వెల్లడించడం గమనార్హం.
కేవలం రాజకీయ నాయకులు, కార్యకర్తలనే కాకుండా, ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. దర్యాప్తు బృందం ఈ విషయాన్ని నిర్ధారించి, హింస చెలరేగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమాయకులపై చర్యలు తీసుకొవద్దని.. పోలీసులు, అధికారులు మానవ హక్కులను కాపాడేలా వ్యవహరించాలని సూచించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఈ ఘటనపై 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa