|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:04 PM
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులు నేపథ్యంలో అగ్రరాజ్యం ఊహించని రీతిలో ఆర్థికంగా కుదెలవుతోంది. గత ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభం కాగా.. కేవలం మొదటి రెండు రోజులు అంటే 48 గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సుమారు 5.6 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 51,400 కోట్లు) విలువైన మందుగుండు సామగ్రిని ఖర్చు చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ సంచలన నివేదికను వెల్లడించింది. ఇది కేవలం దాడుల్లో వాడిన క్షిపణులు, బాంబుల ఖర్చు మాత్రమేనని, యుద్ధ విమానాల నిర్వహణ, దళాల తరలింపు వంటి ఖర్చులు కలిపితే ఈ అంకె ఆకాశాన్ని తాకుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను ప్రయోగించింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ డేటా ప్రకారం.. ఇరాన్‌లోని 5,000 లక్ష్యాలపై దాడి చేసేందుకు 2,000కు పైగా అత్యాధునిక ఆయుధాలను వాడారు. యుద్ధం ఇంత ఖరీదైనదిగా మారడంతో.. అమెరికా రక్షణ నిల్వలు హరించుకుపోతున్నాయని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని భర్తీ చేసేందుకు వేల కోట్ల రూపాయలతో కూడిన 'సప్లిమెంటరీ డిఫెన్స్ బడ్జెట్'ను ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ పాలన కుప్పకూలుతుందని ట్రంప్ ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టి ప్రతీకారానికి పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ తన క్షిపణులతో పర్షియన్ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయాలని చూసినా.. గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అయితే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ప్రపంచ ఇంధన సరఫరాకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఆయుధాల ఖర్చును తగ్గించుకోవడానికి అమెరికా ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. లక్షలాది డాలర్ల విలువైన ప్రెసిషన్ క్షిపణుల కంటే.. తక్కువ ధరకే లభించే లేజర్ గైడెడ్ బాంబులను వాడాలని నిర్ణయించింది. దీనివల్ల ఒక్కో దాడి ఖర్చు మిలియన్ డాలర్ల నుంచి లక్ష డాలర్ల లోపుకు తగ్గుతుంది. అంతేకాకుండా ఇరాన్ దాడులను తట్టుకోవడానికి దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి థాడ్, పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను అమెరికా మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తోంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా పట్టును బలహీనపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.