|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 08:01 PM
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా, ఇజ్రాయల్ ఆర్థిక మూలాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇవి మరింత తీవ్ర చేస్తామని హెచ్చరికలు కూడా చేస్తోంది. ఇదిలావుంటే అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మరో బాంబు పేల్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
కీలక అమెరికా సంస్థలతో సంబంధం ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐటీ కంపెనీల జాబితాను ప్రచురించిన ఇరాన్ అనుబంధ మీడియా తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ... వీటికి ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నాయని, సైనిక ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుంటున్నాయని ఆరోపించింది. ఈ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను ఇరాన్ కొత్త లక్ష్యాలుగా అభివర్ణించింది. ప్రాంతీయ సంఘర్షణ ‘మౌలిక సదుపాయాల యుద్ధం’గా విస్తరిస్తున్న కొద్దీ, ఇరాన్ చట్టబద్ధంగా భావించే లక్ష్యాల పరిధి కూడా పెరుగుతుందని తస్నిమ్ తెలిపింది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, పలాంటిర్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్ వంటి కంపెనీల పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి. ఈ సంస్థలకు అనుబంధంగా కార్యాలయాలు, క్లౌడ్-సర్వీస్ మౌలిక సదుపాయాలు ఇజ్రాయెల్ నగరాలు, కొన్ని గల్ఫ్ దేశాలలో ఉన్నాయని పేర్కొంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు, ఇరాన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా దుబాయి ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్టు స్థానిక అధికారులు తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌పైపు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయి. అయితే భారీ వార్‌హెడ్‌లతో ఉన్న క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తోంది. క్లస్టర్ బాంబులు గాల్లోనే పేలిపోయి.. దాదాపు కొన్ని కిలోమీటర్ల వ్యాసార్థంలో చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. ఈ బాంబులను అడ్డుకోవడం ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలకు పెను సవాలుగా మారాయి. గతేడాది జూన్‌లో 12 రోజుల జరిగిన యుద్ధంలోనూ ఈ క్లస్టర్ బాంబులను ఇరాన్ వినియోగించిందనే ఆరోపణలు వచ్చాయి. కనీసం మూడుసార్లు ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించిందని మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
Latest News