|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:14 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా నాయుడుపేటలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. నాయుడుపేటలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్, సిర్మా ఎస్‌జీఎస్, వెబ్‌సోల్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నాయుడుపేట మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందుతోందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన నేపథ్యంలో.. నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు.
"తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వేగంగా ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. PremierEnergies, Syrma SGS, Websol, Phillips Carbon Black వంటి ప్రముఖ కంపెనీలు బలమైన ఉనికిని ఏర్పరుస్తున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ ఈ ప్రాంతంలో సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గృహనిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాను. ఈ చొరవ శ్రామిక శక్తికి స్థిరమైన జీవన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, అవసరమైన సౌకర్యాలను పొందవచ్చు" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏపీలో రూ.5,942 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడులతో 5 గిగావాట్ల సిలికాన్ ఇంగోట్ , నాలుగు గిగావాట్ల టాప్‌కాన్ సోలార్ సెల్ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్‌లో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా 3,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. అలాగే సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు 269 ఎకరాల భూములను సైతం ఏపీ ప్రభుత్వం సమకూర్చింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూమిని అందించింది. నాయుడుపేట ప్రాంతం పోర్టుకు సమీపంలో ఉండటంతో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నాయుడుపేటలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే 2వ అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల తయారీ సంస్థ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ రాష్ట్రానికి రావడం గర్వంగా ఉందంటూ నారా లోకేష్ అప్పట్లో ఈ వివరాలను వెల్లడించారు. ఏపీ యువతకు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగవుతాయని పేర్కొన్నారు.
Latest News