కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:18 PM

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు .. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు తుదిశ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించటంతో.. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కావూరు సాంబశివరావు 1943 అక్టోబర్ రెండో తేదీన జన్మించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి పనిచేశారు. 1984,1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు కావూరి. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు.


అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కావూరి రాజకీయ ప్రస్థానం మారిపోయింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన.. 2014 తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. కావూరి సాంబశివరావు కుమార్తె తనయుడే. ఆ రకంగా కావూరి సాంబశివరావు కుటుంబానికి, నందమూరి, నారా కుటుంబాలకు మధ్య బంధుత్వం ఉంది. మంత్రి నారా లోకేష్ ఆదివారం కావూరి సాంబశివరావును ఆస్పత్రిలో పరామర్శించారు.


కావూరి మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..


మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణంపై తెలుగు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని.. కావూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


"కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఐదు సార్లు ఎంపీగా మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలు అందించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.


"మాజీ కేంద్ర మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మంచి విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన ఆయన, అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు సేవలందించటం ద్వారా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ట్వీట్ చేశారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM