|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:37 PM
ఇరాన్‌పై సైనిక ఘర్షణలకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశం స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్‌ను ఎగతాళి చేస్తూ.. కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా, ఇరాన్‌ను అమెరికా అధినేత దారుణంగా అవమానించారు. పశ్చిమాసియాలో అదో ఓడిపోయిన దేశం’ అంటూ ఎద్దేవా చేశారు. దాడులపై పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పడంపై ట్రంప్ స్పందిస్తూ.. టెహ్రాన్ ఇక పోరాటం చేయలేక చేతులెత్తేసిందని, ఆ దేశం తోకముడిచిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘‘నరకయాతన అనుభవిస్తున్న ఇరాన్.. క్షమాపణలు చెప్పి, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలకు లొంగిపోయింది.. ఇకపై వారిపై కాల్పులు జరపనని హామీ ఇచ్చింది. ఈ ప్రకటనకు అమెరికా- ఇజ్రాయెల్ నిరంతర దాడులే కారణం’’ అని అన్నారు. ‘‘పశ్చిమాసియాను ఇరాన్ ఇక బెదిరించలేదు.. అదో ఓడిపోయిన దేశం.. లొంగిపోయే వరకు ఇంకా చెప్పాలంటే పూర్తిగా కూలిపోయే వరకు దశాబ్దాల పాటు అదే పరిస్థితిలో ఉంటారు’’అని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను అవమానించేలా తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. అయితే, తన శక్తికి మించి ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ చేస్తున్న పోరాటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో అమెరికా స్థావరాల్లోని రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది.
కాగా, దీనికి ముందు ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోవాలని శుక్రవారం ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాము చెప్పినట్టు విని, తమకు ఆమోదయోగ్యమైన కొత్త నాయకత్వాన్ని నియమిస్తే.. ఇరాన్ పునర్‌నిర్మాణానికి అమెరికా సహాకారం అందిస్తుందని ప్రకటించారు. లొంగిపోయిన తర్వాత.. అమెరికా, దాని మిత్రదేశాలు.. గతంలో కంటే మరింత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చదిద్దుతాయని అన్నారు. అయితే, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి, అమెరికాకు లొంగిపోయే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది.
ఇజ్రాయెల్- అమెరికాతో జరుగుతోన్న యుద్ధంలో గల్ఫ్‌లోని పొరుగు దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశాల భూభాగాల నుంచి తమపై దాడి చేయకుంటే తాము కూడా ఎలాంటి దాడులు చేయమని, ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి దీనిపై నిర్ణయం తీసుకుందని పెజిష్కియాన్ చెప్పారు. అయితే, యుద్ధం ఎనిమిదో రోజు కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై శుక్రవారం 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కోసం నిర్మించిన భూగర్భ బంకర్ ఈ దాడుల్లో ధ్వంసమైంది.
Latest News