|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:23 PM
టీ20 ప్రపంచ కప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. మార్చి 4, 5 తేదిల్లో సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఇందులో మార్చి 4న జరిగే తొలిసెమీస్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్.. మార్చి 5న జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఐసీసీ.. తాజాగా సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలుగా, అంపైర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో వెల్లడించింది. జవగల్ శ్రీనాథ్, ఆండీ పైక్రాఫ్ట్‌లను కోల్‌కతా, ముంబై వేదికగా మ్యాచ్‌లకు రెఫరీలుగా నియమించింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం టీ20 ప్రపంచకప్ 2026లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారత్‌కు చెందిన జవగల్ శ్రీనాథ్ రెఫరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఉంటారు. నితిన్ మేనన్ థర్డ్ అంపైర్‌గా, రాడ్ టక్కర్ నాలుగో అంపైర్‌గా ఉంటారు.
మరోవైపు ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో గురువారం రెండో సెమీఫైనల్ జరగనుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు.. రెఫరీగా పైక్రాఫ్ట్ వ్యవహరించనున్నాడు. క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ థర్డ్ అంపైర్‌గా, పాల్ రీఫెల్ ఫోర్త్ అంపైర్‌గా విధులు నిర్వహించనున్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 .. మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. వీటిని ఐదేసి జట్లకు ఒక గ్రూప్ చొప్పున.. మొత్తం నాలుగు గ్రూప్‌లు విభజించారు. అందులో ప్రతీ గ్రూప్ నుంచి పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించాయి. మళ్లీ వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు చోటు కల్పించారు. గ్రూప్-2లో పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, భారత్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.