|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:24 PM
ఓ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ పోలీస్ రైలులో రివాల్వర్‌తో హల్‌చల్ చేశారు. జనరల్ బోగీలో సీటు కోసం తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో బెదిరింపులకు దిగారు. ఈ ఘటన యలహంక - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలం ఆర్.కృష్ణాపురానికి చెందిన మనోహర్ అనే సీఆర్పీఎఫ్ రిటైర్డ్ పోలీస్.. యలహంక - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ బోగీలోకి ఎక్కారు. అయితే బోగీ మొత్తం నిండిపోయి ఉండటంతో సీటు కోసం ప్రయాణికులను తన రివాల్వర్ తీసి బెదిరించారు. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు.
అయితే కొంతమంది మాత్రం ధైర్యం చేసి ఈ విషయాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో యలహంక - కాచిగూడ రైలు గుంతకల్లు జంక్షన్ చేరుకోగానే.. గుంతకల్లు ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జనరల్ బోగీ వద్దకు చేరుకుని సీఆర్పీఎఫ్ రిటైర్డ్ పోలీస్ మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతణ్ని స్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారించారు.
అయితే తాను ఎవరినీ బెదిరించలేదని మనోహర్ పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించి పోలీసులు అతణ్ని అక్కడి నుంచి పంపించినట్లు తెలిసింది. అయితే మనోహర్ రైలు బోగీలో తుపాకీ బయటకు తీసి నిలబడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు సీటు కోసం రివాల్వర్ తీసి బెదిరించటంతో ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో బాధ్యతగల ఉద్యోగం చేసి.. ఇలా ప్రవర్తించవచ్చా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జనరల్ బోగీలో సీటు కోసం రివాల్వర్‌తో బెదిరించారనే వార్తపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. జనరల్ బోగీలలో సీట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.