|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:40 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల వరకు (ఎంఏఎం సీజన్... మార్చి-ఏప్రిల్-మే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుందని స్పష్టం చేసింది. సాధారణంగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా వడగాల్పుల రోజులు గణనీయంగా పెరుగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 2001 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, చలి తీవ్రత తక్కువగా ఉండటం రాబోయే కఠిన వేసవికి సంకేతాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.తీవ్రమైన ఎండల కారణంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగడం తగ్గించుకోవాలని ఐఎండీ సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా నీటి వనరులు, విద్యుత్ డిమాండ్‌పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంస్థలు నీటి ఎద్దడి తలెత్తకుండా, వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Latest News