|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 06:57 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. గుంటూరులో పర్యటించిన వైఎస్ జగన్.. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. అంబటి ఇంటిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబుపైనా ఓ రేంజులో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదన్న జగన్.. వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఇలాంటి చర్యలతో భయపడతామనుకుంటే చంద్రబాబు అంత మూర్ఖుడు ఉండరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేవుడంటే చంద్రబాబుకు భక్తీ, భయం రెండూ లేవన్న జగన్.. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ ల్యాబ్‌లు కూడా తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని నివేదికలు ఇచ్చాయని.. సీబీఐ ఆధ్వర్యంలో ఈ టెస్టులు జరిగాయని జగన్ వివరించారు. తప్పు చేసి ఉంటే వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లను సీబీఐ ఛార్జ్‌షీట్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. చేసిన తప్పులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లెంపలేసుకోవాలన్నారు. అబద్ధాలు చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని.. సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమంటూ తాము ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
గుడికి వెళ్లి తిరిగి వస్తున్న అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డగించి.. బూతులు తిడుతూ, కర్రలు, రాడ్లతో దాడి చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. తనను తిట్టినవారిపైనే అంబటి రాంబాబు స్పందించారన్న వైఎస్ జగన్.. చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి విచారం వ్యక్తం చేశారన్నారు. అయినప్పటికీ అంబటిని హత్య చేయాలని ప్రయత్నించారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారని.. ఇంట్లో పిల్లలు, మహిళలు ఉన్నా దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.
పోలీసుల సమక్షంలోనే ఇంటిని ధ్వంసం చేశారని.. ఐదు కార్లను పగలగొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారన్న వైఎస్ జగన్.. అంబటి రాంబాబును అరెస్ట్ చేసి.. దాడులు చేసిన వారిని మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటి మీద ఇదే తరహాలో దాడి చేశారని ఆరోపించారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్న వైఎస్ జగన్.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తామన్నారు. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని.. అందరి లెక్కలూ తేలుస్తామంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.