|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:04 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాలలోనూ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన పశువుల మందులను రైతులకు అందుబాటులో ఉంచుతారు. తక్కువ ధరలోనే క్వాలిటీ పశువుల మందులు రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తు్న్నారు. ఈ విషయాన్ని ఏపీ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వెల్లడించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, సహకార సమాఖ్యల ద్వారా ఈ పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 120 చదరపు అడుగుల కనీస విస్తీర్ణంలో ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సొంత స్థలంలో అయినా, అద్దెకు తీసుకున్న స్థలంలో అయినా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాలను నిర్వహించేందుకు ఫార్మసిస్టులను కూడా నియమిస్తారు. అలాగే ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అనుమతులను సంబంధిత డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి పొందాల్సి ఉంటుంది.
మరోవైపు ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలకు కావాల్సిన ఔషధాల సేకరణ, క్వాలిటీ టెస్టింగ్, స్టోరేజ్, మేనేజ్‌మెంట్, సరఫరా వంటి విషయాలను చూస్తుంది. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా వెటర్నరీ ట్రీట్మెంట్ ఖర్చులు తగ్గించడం, లైవ్ స్టాక్ ప్రొడక్టివిటీ పెంచడం, పశుసంవర్ధక రంగం అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ఆపరేటివ్ మార్జిన్ ఇన్సెంటివ్ కింద 20 శాతం అందించనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో.. పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు, సంస్థలు https://pashuaushadhi.dahd.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని అధికారులు సూచించారు. లేదా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. మరోవైపు పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సహకార సొసైటీలతో పాటుగా వ్యక్తిగతంగా B.Pharmacy లేదా D.Pharmacy చదివిన వారు అర్హులు. అలాగే కనీసం 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. డ్రగ్ సేల్ లైసెన్స్ అండ్ ఫార్మాసిస్ట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Latest News